వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ.. తీవ్రమైన బాధతో తప్పుకుంటున్నా : జోస్ బట్లర్

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (16:57 IST)
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నారు. తన సారథ్యంలో జట్టుకు ఎదురైన వరుస ఓటములను నైతిక బాధ్యత వహిస్తూ, తీవ్రమైన బాధతో తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవలికాలంలో ఇంగ్లండ్ జట్టు వన్డేలు, టీ20ల్లో వరుసగా ఓటములను చవిచూస్తూ వచ్చింది. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ అదేపరిస్థితి నెలకొంది. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
"ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నందుకు చాలా బాధగా ఉంది. దేశానికి సారథ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవం. దీనికి నేను ఎల్లపుడూ గర్వపడతాను. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇది సరేన సమయం. నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు, సిబ్బంది, ఇంగ్లండ్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా భార్య లూయిస్, నా కుటుంబానికి థ్యాంక్స్. వారే నా ఎత్తుపల్లాలతో కూడిన ఈ జర్నీకి అసలైన స్తంభాలు" అంటూ స్టోరీ రాసుకొచ్చారు.
 
ఇకపోతే, చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టు భారత్‌‍లో పర్యటించింది. మొత్తం మూడు వన్డేల్లో వైట్ వాష్ అయింది. అలాగే, చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంగ్లండ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. దీంతో సెమీస్ చేరే అవకాశాలు కోల్పోయి, ఇంటికి చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు