నాడు క్రికెటర్.. నేడు మంత్రి : రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా

శుక్రవారం, 27 మే 2016 (14:39 IST)
లక్ష్మీ రతన్ శుక్లా... భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్. 1999లో భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న బెంగాల్ క్రికెటర్. ఆల్‌రౌండర్. రైడ్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, రైట్ హ్యాండ్ మీడియం పేసర్. అంతర్జాతీయ స్థాయిలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. 1999, మార్చి 22వ తేదీన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం మూడు మ్యాచ్‌లలో 18 పరుగులు చేయగా, అత్యధిక స్కోరు 13 రన్స్. అలాగే, మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ట్వంటీ-20లు మాత్రం 81 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో రాణించలేక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 
 
ఈ క్రమంలో బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2016 ఎన్నికల్లో హౌరా నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా మహాభారత్ ఫేం, వెస్ట్ బెంగాల్ భాజపా మహిళా విభాగం అధ్యక్షురాలు రూపా గంగూలీ పోటీ చేసింది. ఆమె నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న శుక్లా.. ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకున్నాడు. ఇపుడు మమతా బెనర్జీ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నాడు. బెంగాల్ కేబినెట్‌లో చోటు కల్పించిన కొత్త ముఖాల్లో శుక్లా ఒకరు కావడం గమనార్హం. అయితే ఆయనకు కేటాయించే శాఖపై స్పష్టత రావాల్సింది. 

వెబ్దునియా పై చదవండి