పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది పాక్‌కు తీవ్ర అవమానమని భావించిన ఆ జట్టు మాజీలు.. పలు ఇంటర్వ్యూల్లో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల ఓ షోలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. టీమ్ ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్ పేరును సరిగ్గా పలకని యూసప్‌పై మాజీ క్రికెటర్ మదన్ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్ల చదువూ, సంస్కారం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశాడు.
'ఇదంతా పబ్లిసిటీ స్టంట్. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తరచూ వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తుంటారు. భారత్ ఆటగాళ్ల దెబ్బకు వారి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది వారి చదువు, సంస్కారం తెలియజేస్తోంది. తిట్టడమనేది ఎప్పుడూ ఉపేక్షించం. వారిపై స్పందిస్తే అనవసరంగా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చినట్లు అవుతుంది. వారు కోరుకొనేది కూడా అదే.
అంపైరింగ్ పైనా అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యమేస్తోంది. ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే సమీక్ష అడగొచ్చు. తప్పు అయితే నిర్ణయం రివర్స్ అవుతుంది. కానీ, అలా చేయకుండా నిందలు వేయడం సరైంది కాదు. ఎప్పుడు సమీక్ష తీసుకోవాలి? ఎప్పుడు అవసరం లేదనేది అర్థం చేసుకుంటేనే క్రికెట్లో మెరుగ్గా రాణించగలం' అని మదన్ లాల్ అభిప్రాయపడ్డారు.