భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఓ మోసగాడు : మనోజ్ తివారీ

ఠాగూర్

శుక్రవారం, 10 జనవరి 2025 (19:13 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఓ మోసగాడు అని కోల్‌కతా నైట్ మాజీ ఆటగాడు మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. గంభీర్ ఒక మోసగాడని, ఆయన ఇతరులకు చెప్పే నీతులు, ఆచరించడని విమర్శలు గుప్పించారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్ ఫ్రాంచైజీ ఆటగాళ్ళు నితీశ్ రాణా, హర్షిత్ రాణాలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తివారీ సూటిగా ప్రశ్నించారు. 
 
గౌతం గంభీర్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు బౌర్డర్ అండ్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. దీంతో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ సంచలన ఆరోపణులు చేయడం గమనార్హం. 
 
ఆస్ట్రేలియాలో సిరీస్‌లో మొదటిదైన పెర్త్ టెస్టులో రాణించిన ఆకాశ్ దీపన్‌ను తదుపరి టెస్టుల్లో పక్కన పెట్టి హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం మనోజ్ తివారీ ప్రశ్నించాడు. 'ఈ మార్పు ఎలా సాధ్యమైంది?. ఆకాశ్ దీప్ ఏం తప్పు చేశాడు?. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్ కండీషన్లు అర్థం చేసుకొని బౌలింగ్ చేయగలిగే బౌలర్ కావాలని మీరే (గంభీర్) చెబుతుంటారు. కానీ, అలాంటి సామర్థ్యం ఉన్న ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. ఆకాశ్ దీప్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అందుకే ఆటగాళ్లు అతడిని సమర్థిస్తుంటారు' అని గుర్తు చేశారు. 
 
తానేమీ తప్పుగా అనడం లేదని, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నానని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. గతంలో గంభీర్ తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని, టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీని గురించి కూడా చెడుగా మాట్లాడాడని ఆరోపించాడు. ఢిల్లీలో రంజీ ట్రోఫీ మ్యాచ్లో గంభీర్ తాను గొడవ పడినప్పుడు అందరూ అతడు చెప్పిన మాటలే విన్నారని వాపోయాడు. గంభీర్ ఏం మాట్లాడిన పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్ గొప్పగా ప్రచారం చేస్తుందని, దాని గురించే తాను మాట్లాడుతున్నానని వివరించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు