ఇండోర్‌లో రికార్డుల పంట.. ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

శనివారం, 16 నవంబరు 2019 (17:33 IST)
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో కోహ్లీసేన రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఒకే సీజన్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించడం టీమిండియాకు ఇది మూడో సారి కావడం విశేషం. 
 
పుణె, రాంచీ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై, ఇండోర్‌లో బంగ్లాపై కోహ్లీసేన వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టీమిండియా 1992/93, 1993/94 సీజన్లలో కూడా ఈ తరహాలోనే విజయం సాధించింది.
 
అలాగే ఈ విజయంతో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్ విజయాలను అందుకున్న భారత కెప్టెన్‌గా కోహ్లీ అవతరించాడు. మాజీ కెప్టెన్ ధోనీ 9 ఇన్నింగ్స్ విజయాలతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా 10 ఇన్నింగ్స్ విజయాలతో ధోనీని కోహ్లీ రెండో స్థానంలోకి నెట్టేశాడు. ఆ తర్వాతి స్థానంలో 8 విజయాలతో అజారుద్దీన్, 7 విజయాలతో గంగూలీ ఉన్నారు. 
 
ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు రికార్డుల పంట పండించారు. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా ఆరో బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ రికార్డు సృష్టించాడు. డబుల్ సెంచరీతో జట్టుకు అత్యధిక పరుగులు సాధించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులు మాత్రమే చేసింది. ఏ ఇన్నింగ్స్‌లోనూ మయాంక్‌ (243) స్కోరుని బంగ్లా దాటలేకపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు