ధోనీ రికార్డుల పంట.. క్రికెట్ నుంచి తప్పుకున్నా క్రేజ్ తగ్గలేదు.. (Video)
శనివారం, 9 జనవరి 2021 (09:55 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. కానీ ఐపీఎల్‌లో ఆడిన ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఈ ఏడాది రాణించలేకపోయాడు. అయినా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు ధోనీ. ఇక గ్రౌండ్‌లో సిక్సర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మిస్టర్ కూల్ ఇప్పుడు నెట్టింట్లోనూ సందడి చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధోనీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన రెండో క్రికెటర్‌గా ధోనీ సరికొత్త రికార్డు సృష్టించారు. మొదటి స్థానంలో 88 మిలియన్ల ఫాలోవర్లతో టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ రెండో స్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలోనే ధోనీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాంచీ శివారుల్లో ధోనీకి 43 ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ధోనీ 10 ఎకరాల్లో పంటలను పండిస్తున్నారు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఓ వీడియోను ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఫామ్ హౌజ్‌లో పండిస్తోన్న స్ట్రాబెరీని తింటున్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ధోనీ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను 70 లక్షలమందికిపైగా వీక్షించడం విశేషం.
ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. వచ్చే ఐపీఎల్‌లో ధోని బరిలో దిగితే పొట్టి లీగ్‌లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు కలుపుకుని అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడు ధోనీనే. 2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై కొనుక్కుంది.
అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వేతనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ధోని జీతం రూ.8.28 కోట్లకు పెరిగింది. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగింది. 2014, 2015లలో ధోని ఏడాదికి రూ.12.5 కోట్లు సంపాదించాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున రెండేళ్లు ఆడిన ధోనీకి రూ.25 కోట్లు లభించాయి.
ఇప్పటి వరకు రూ.131 కోట్లతో రోహిత్‌శర్మ ద్వితీయ, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లి తృతీయ స్థానాల్లో ఉన్నారు. వచ్చే సీజన్‌లో రోహిత్‌కు ముంబయి ఇండియన్స్ రూ.15 కోట్లు ఇస్తుంది. అంటే.. రూ.146 కోట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉంటాడు.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లీకి రూ.17 కోట్లు ఇస్తుంది. రూ.143 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతాడు. 2021 ఐపీఎల్‌లో బరిలో దిగితే సురేశ్ రైనా, డివిలియర్స్‌లు రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తారు.