కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి అడుగుపెట్టేది లేదు... రిలయన్స్

సోమవారం, 4 జనవరి 2021 (11:19 IST)
పలు రంగాల్లో రాణిస్తున్న రిలయన్స్ సంస్థ కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి ప్రవేశించేది లేదని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ శక్తులు లాభపడతాయన్న విమర్శల నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ స్పందించింది. కాంట్రాక్ట్ వ్యవసాయం లేదా కార్పొరేట్ వ్యవసాయంలోకి తాము ప్రవేశించమని రియలన్స్ కీలక ప్రకటన చేసింది. 
 
అంతేకాకుండా రైతుల నుంచి వ్యవసాయ భూములను కూడా కొనుగోలు చేసే ఆలోచనకు తమకు లేదని స్పష్టం చేసింది. సోమవారం ఈ మేరకు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో కూడా వీటిపై తమ దృష్టి నిలపమని రిలయన్స్ కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. రైతుల నుంచి నేరుగా తాము పంటలను కొనుగోలు చేయమని, కేవలం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం మాత్రమే తమ సరఫరాదారులు కొనుగోలు చేస్తారని తెలిపింది.
 
తక్కువ ధరలకుండే ఏ దీర్ఘకాలిక సేకరణ ఒప్పందంలోకి తాము ప్రవేశించాలని భావించడం లేదని తెలిపింది. ''రైతులు కష్టపడి పండించిన పంటలకు లాభదాయకమైన ధర లభించి, వారి కృషికి ప్రతిఫలం లభించాలన్నదే రియలన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుకే కట్టుబడి ఉండాలని మా సరఫరాదారులనూ మేం కోరుతున్నాం.'' అని రియలన్స్ పేర్కొంది. 
 
రైతుల నిరసన సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చోటు చేసుకున్న సెల్ టవర్ల ధ్వంసం పై కూడా స్పందించింది. ఈ సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులతో పాటు వ్యాపార శత్రువులున్నట్లు తాము భావిస్తున్నామని రియలన్స్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు