157 పరుగులు చేయాల్సి ఉండగా, చివరి రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. పదే పదే వర్షం పడుతుండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నిరాశాజనకంగా ముగిసింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ నెల 12 నుంచి జరగనుంది.
అయితే, ఇంగ్లండ్‌తో తొలి టెస్టు చివరి రోజు వర్షం ఆటంకం కలిగించడం, మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, కొంత అసహనం వ్యక్తం చేశాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్ డ్రా కావడం ఆవేదనకు గురి చేసిందన్నాడు.
ఇది నిజంగా సిగ్గుచేటు. లక్ష్య ఛేదనలో మేం మంచి స్థితిలో ఉన్నాం. గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. కానీ, మూడో రోజో.. నాలుగో రోజో పడుతుందనుకున్న వర్షం.. ఐదో రోజు పడి మా ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు మొత్తం ఆట ఆడే వీలు లేకుండా పోయింది అని వ్యాఖ్యానించాడు.