క్రికెట్ ప్రపంచంలో అత్యంత చెత్త ఫీల్డింగ్ చేసే జట్టు ఏది?

ఠాగూర్

గురువారం, 4 సెప్టెంబరు 2025 (10:55 IST)
ప్రపంచ క్రికెట్ ఆడే జట్లలో పాకిస్థాన్ జట్టు ఒక అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో అపుడపుడూ సత్తా చాటే పాక్ ఆటగాళ్ళు.. ఫీల్డింగ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చూపుతున్నారు. అందుకే చెత్త ఫీల్డింగ్ చేయడంలో మొదటి జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఆ జట్టు పేలవమైన ప్రదర్శనపై క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. 
 
ఈ గణాంకాల ప్రకారం... ఈ యేడాది పాకిస్థాన్ ఫీల్డర్లు ఏకంగా 48 క్యాచ్‌లను నేలపాలు చేశారు. అంతేకాకుండా, సులభంగా లభించే 98 రనౌట్ అవకాశాలను చేజార్చుకున్నారు. ఈ రెండు విభాగాల్లో 41 జట్లతో పోలిస్తే పాకిస్థాన్‌దే అట్టడుగు స్థానం కావడం గమనార్హం. 
 
ఇక మైదానంలో బంతిని ఆపడంలోనూ విఫలమవుతూ 89 సార్లు మిస్ ఫీల్డ్ చేశారు. ఈ విషయంలో వెస్టిండీస్ (90) తర్వాత పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. మొత్తం 12 పూర్తిస్థాయి సభ్య దేశాల్లో క్యాచ్‌లను పట్టే సామర్థ్యంలో పాక్ 81.4 శాతంతో 8వ స్థానంలో నిలవడం వారి ఫీల్డింగ్ దుస్థితికి అద్దం పడుతోంది.
 
ఇటీవల యూఏఈలో జరిగిన టీ20 ముక్కోణపు సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం దారుణమైన ఫీల్డింగే. కీలక సమయంలో క్యాచ్‌లను వదిలేయడం, మిస్ ఫీల్డ్ చేయడం ద్వారా ప్రత్యర్థికి సునాయాసంగా పరుగులు సమర్పించుకున్నారు.
 
అయితే, జట్టు ఫీల్డింగుపై వస్తున్న విమర్శలను పాక్ ఆటగాళ్లు అంగీకరించడం లేదు. ఇటీవల ఓ మీడియా ప్రతినిధి ఫీల్డింగ్ వైఫల్యాలపై ప్రశ్నించగా, పాక్ పేసర్ హారిస్ రవూఫ్ తీవ్రంగా స్పందించాడు. "మీరు మ్యాచ్‌లను సరిగ్గా చూడటం లేదు. మా ఫీల్డింగులో ఎలాంటి తప్పులు లేవు. మళ్లీ ఒకసారి మా ఆటను సమీక్షించుకుంటే మీకే అర్థమవుతుంది" అంటూ ఆయన ఎదురుదాడి చేశారు. ఏదేమైనా, గణాంకాలు మాత్రం పాకిస్థాన్ ఫీల్డింగ్ డొల్లతనాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు