రంజీ ట్రోఫీ 2022లో జార్ఖండ్ జట్టు అదుర్స్...

మంగళవారం, 15 మార్చి 2022 (10:09 IST)
రంజీ టోర్నీలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు హైదరాబాద్ జట్టు పేరు మీదనే ఉంది. 1993-94 సీజనల్లో ఆంధ్రా జట్టుపై హైదరాబాద్ జట్టు 944/6 డిక్లేర్డ్ పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత రెండో అత్యధిక స్కోర్ తమిళనాడు పేరు మీద ఉంది. 
 
1988-89 సీజన్‌లో తమిళనాడు జట్టు గోవాపై 912-6 డిక్లేర్డ్ పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక మూడో అత్యధిక స్కోర్ మధ్యప్రదేశ్ పేరు మీద ఉంది. మధ్యప్రదేశ్ జట్టు 1945-46 సీజన్‌లో కర్ణాటకపై 912-8 డిక్లేర్డ్ స్కోర్ చేసింది.
 
తాజాగా రంజీ ట్రోఫీ 2022లో జార్ఖండ్ జట్టు రికార్డు సృష్టించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 880 పరుగుల భారీ స్కోరును సాధించింది. 
 
రంజీ టోర్నీ చరిత్రలో ఇది నాల్గో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ భారీ డబుల్ సెంచరీ, ఓ భారీ సెంచరీ ఉన్నాయి.
 
అలాగే 11వ నంబర్‌లో వచ్చిన బ్యాటర్ కూడా 85 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడడం విశేషం. జార్ఖండ్ జట్టులో కుమార్‌ కుశాగ్రా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 270 బంతుల్లోనే 266 పరుగులతో విరుచుకుపడ్డాడు. కుశాగ్రా ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 37 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
 
మిగతా వారిలో నదీమ్ 177 (22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్‌ సింగ్ 107 (13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుమార్‌ సూరజ్ 69 (11 ఫోర్లు, సిక్స్‌), అంకుల్‌ రాయ్ 59 ( 7 ఫోర్లు), రాహుల్‌ శుక్లా 85 నాటౌట్ ( 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. 
 
రాహుల్ శుక్లా 11వ నెంబర్‌లో వచ్చి 85 పరుగులు చేశాడు. మొత్తంగా జార్ఖండ్ 880 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు