ఐదేళ్ళ పాలన తర్వాత అధికారం నిలబెట్టుకున్న ఏకైక సీఎం యోగి

గురువారం, 10 మార్చి 2022 (14:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆయన యూపీ సీఎంగా ఐదేళ్ళ పాలన సాగించారు. అలా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నికలకు వెళ్లి మళ్లీ వరుసగా పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్నారు. 
 
అంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి అధికారాని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా యోగి తన పేరును యూపీ చరిత్రలో లిఖించుకున్నారు. అలా 37 యేళ్ల తర్వాత వరుసగా రెండేళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న ఏకైక సీఎం ఆయనే కావడం గమనార్హం. అంతేకాకుండా, బీజేపీకి చెందిన యూపీ సీఎంలలో అధికారం కాపాడుకున్న ఒకే ఒక్కడు యోగి ఆదిత్యనాథ్. 
 
ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. 
 
ఈ రాష్ట్రంలో గత 1952 మే 20వ తేదీన తొలిసారి శాసనసభ ఏర్పాటైంది. 70 యేళ్లలో 21 మంది ముఖ్యమంత్రులు మారారు. ఒక సీఎం మొదటి ఐదేళ్లు పాలన పూర్తి చేసి విజయవంతంగా రెండోసారి ఎన్నికైంది ఆదిత్యనాథ్ ఒక్కరే. 
 
అంతేకాకుండా, ఈ రాష్ట్ర చరిత్రలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన వారిలో ఐదుగురే ఉన్ారు. వారిలో యోగి ఆదిత్యనాథ్ ఐదో నేత. గతంలో సంపూర్ణానంద, చంద్రభాను, హెమ్‌వంతి నందన్ బహుగుణ, ఎన్డీ తివారీలకే ఈ అవకాశం లభించింది. 
 
37 యేళ్లలో అధికారం నిలబెట్టుకున్న సీఎం ఆదిత్యనాథే. 1985లో అవిభాజ్య యూపీ సీఎంగా ఎన్డీ తివారీ ఉన్నారు. నాడు ఎన్నికల్లో తివారీ గెలిచి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
 
ఇపుడు యోగి ఆదిత్యనాథ్ కూడా అలాగే మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. యూపీకి నలుగురు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్‌లు ఉండగా, వీరిలో ఎవరు కూడా మళ్లీ అధికారంలోకి రాలేదు.
 
యూపీలో ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న వారిలో యోగి ఆదిత్యనాథ్ మూడో వ్యక్తి. గతంలో మాయావతి (2007-12), అఖిలేష్ సింగ్ యాదవ్ (2012-17)లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు