భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్‌సింగ్‌ల పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జడేజా ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
లంక బ్యాట్స్‌మన్ ధనంజయ డిసిల్వాను ఔట్ చేసిన జడేజా.. టెస్టుల్లో 150 వికెట్లు తీసుకున్నాడు. కేవలం 32 టెస్టుల్లోనే జడేజా 150 వికెట్ల మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే (34), హర్భజన్ సింగ్ (35), కపిల్ దేవ్ (39 టెస్టులు)లను అతను వెనక్కి నెట్టాడు.
అయితే ప్రస్తుతం అతని టీమ్ మేట్, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇంకా జడ్డూ కంటే ముందున్నాడు. అతను కేవలం 29 టెస్టుల్లోనే 150 వికెట్లు తీశాడు. ఇక లెఫ్టామ్ బౌలర్లలో మాత్రం జడ్డూ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు అందుకున్న లెఫ్టామ్ బౌలర్‌గా మిచెల్ జాన్సన్ పేరిట ఉన్న రికార్డును జడ్డూ అధిగమించాడు.