పుల్వామా ఘటన.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో సంబంధాలు కట్.. ఐఎంజీ రిలయన్స్

సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:57 IST)
పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే పాకిస్థాన్‌పై చర్యలకు సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నిర్ణయించింది.


ఇప్పటివరకు పీఎస్ఎల్‌కు అధికారికంగా ప్రొడక్షన్ పార్టనర్‌గా వున్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్‌తో ఏమాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. 
 
తక్షణం తమ నిర్ణయం అమలులోకి వచ్చిందని.. ఐఎంజీ రిలయన్స్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా వెల్లడించామని ఐఎంజీ రిలయన్స్ అధికారి తేల్చేశారు. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని ఐఎంజీ రిలయన్స్ స్పష్టం చేసింది. 
 
కాగా.. పీఎస్ఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ-రిలయన్స్ పలు మ్యాచ్‌ల లైవ్ కవరేజ్‌కి అవసరమయ్యే వనరులను  సమకూర్చాల్సి వుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్‌లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. కానీ ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్ నుంచి ఐఎంజీ రిలయన్స్ తప్పుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు