ఆయనో క్రికెట్ దేవుడు. క్రికెట్ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు అమితంగా ఆరాధించే క్రికెట్ దిగ్గజం. ప్రస్తుతం క్రికెట్‌కు స్వస్తి చెప్పి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, అపుడపుడూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ టెస్ట్ సిరీస్ సందర్భంగా చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో పని చేసే వెయిటర్‌ను గుర్తుకు తెచ్చుకున్నాడు. పైగా, అతను ఇచ్చిన సలహాతో తన బ్యాటింగ్‌శైలిని మార్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వెయిటర్ ఎక్కడున్నారో కాస్త చెప్పండంటూ నెటజన్లను కోరాడు. ఆ క్రికెట్ దేవుడు ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశాడు. గతంలో తాను చెన్నై తాజ్ కోరమాండల్ హోటల్ రూమ్‌లో ఉండగా, వెయిటర్‌ను కాఫీ తీసుకురమ్మన్నానంటూ చెప్పడం మొదలుపెట్టారు.
"ఆ వెయిటర్ కాఫీ తీసుకుని నేనుంటున్న రూమ్‌లోకి వచ్చాడు. సచిన్, మీతో క్రికెట్ గురించి మాట్లాడొచ్చా? అని అడిగాడు. ఓహ్, ష్యూర్ అని జవాబిచ్చాను. దాంతో అతడు ఇలా చెప్పాడు. మీరు మోచేతికి ఆర్మ్ ప్యాడ్ కట్టుకున్న ప్రతిసారి మీరు బ్యాట్ ఊపే విధానంలో స్వల్పంగా మార్పు వస్తోంది. అది మీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తోంది అన్నాడు. నాతో అప్పటివరకు ఆ అంశం గురించి మాట్లాడినవాళ్లే లేరు. కానీ ఆ వెయిటర్ ఎంతో నిశితంగా గమనించి ఆ సూచన చేశాడని అర్థమైంది.
ఆ తర్వాత అతని గురించి తెలిసిందేంటంటే తను నాకు వీరాభిమాని. ఒక్కో బంతిని ఐదారుసార్లు రీప్లే చేసి చూసేంత అభిమానం ఉంది. ఆ వెయిటర్ చెప్పిన విషయం నాకు నిజమేననిపించింది. వెంటనే ఆ ఆర్మ్ ప్యాడ్‌ను నా మోచేతి సైజుకు అనుగుణంగా రీడిజైన్ చేయించాను. ఎంతమేర ప్యాడింగ్ ఉండాలి? ఎక్కడ స్ట్రాప్స్ ఉండాలి? ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పి కొత్త ఆర్మ్ ప్యాడ్‌ను తయారుచేయించాను. ఆ సరికొత్త ఆర్మ్ ప్యాడ్ ధరించిన తర్వాత నా బ్యాటింగ్‌లో మెరుగైన మార్పు వచ్చింది. ఇప్పుడా వెయిటర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనిపిస్తోంది. నెటిజన్లూ... ఆ వెయిటర్ ఎక్కడున్నాడో కాస్త చెప్పగలరా" అంటూ సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.