తాజాగా ఇద్దరు అక్కాచెల్లెళ్ల కోసం నిస్వార్థంగా ముందుకొచ్చిన వైనం ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్స్‌ను గమనిస్తే బార్బర్ షాప్ గాళ్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేహా, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మగవారికి మాత్రమే పరిమితం అనుకోకుండా సొంతంగా బార్బర్ షాప్ పెట్టారు. మగవారికి షేవింగ్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు.
వీరికి ప్రఖ్యాత షేవింగ్ ఉపకరణాల సంస్థ జిల్లెట్ (బ్లేడ్ల తయారీ కంపెనీ) కూడా వీరికి తనవంతు సాయం చేసింది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ అక్కాచెల్లెళ్లను ప్రోత్సహించే క్రమంలో వారి సెలూన్‌కు వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సచిన్ ఇప్పటివరకు ఎక్కడా బయట షేవింగ్ చేయించుకోలేదు. ఆ విషయం తనే స్వయంగా చెప్పారు.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బన్వారీ తోలా అనే ప్రాంతానికి చెందిన నేహా, జ్యోతి అనే ఇద్దరు అమ్మయిలు తమ తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు వీలుగా వివిధ రకాల హెయిర్ కటింగ్స్‌ను నేర్చుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే సెలూన్‌లో పనిచేయడం కొనసాగించారు. ఈ విషయం జిల్లెట్ సంస్థకు తెలియడంతో వారి కథను ఆధారంగా చేసుకుని చిన్న వాణిజ్య ప్రకటన చేసి విస్తృత ప్రచారం కల్పించింది. ఈ విషయం తెలుసుకున్న సచిన్ టెండూల్కర్ ఇపుడు ఆ అక్కాచెల్లెళ్ల సెలూన్‌కు వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు. దీంతో ఇపుడు వారి సెలూన్ పేరు మార్మోగిపోతోంది.