మోదీ ఉన్నంతకాలం.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడనివ్వరు.. షాహిద్ అఫ్రిది

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (08:23 IST)
భారత ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడనివ్వరని ఆ దేశ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అన్నారు. ముంబై పేలుళ్ల అనంతరం విదేశీ గడ్డపై భారత్-పాకిస్థాన్ జట్లు ఐసీసీ నిర్వహించే క్రికెట్ టోర్నీల్లో ఆడుతున్నాయి. కానీ ఇరుదేశాల మధ్య సొంత గడ్డలపై ఎలాంటి క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మోదీ పదవిలో ఉన్నంత కాలం పాకిస్థాన్ తో క్రికెట్ ఆడేందుకు భారత్ ఒప్పుకోకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇరు దేశాల ప్రజలు సరిహద్దులు దాటి సుహృద్భావ సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తుంటే, మోదీ తిరోగమనంలో పయనిస్తున్నారని విమర్శించాడు.
 
"మోదీ అధికారంలో కొనసాగినంత కాలం భారత్ నుంచి పాకిస్థాన్ క్రికెట్‌కు ఎలాంటి సానుకూల స్పందన రాదు. మోదీ ఎలా ఆలోచిస్తారో మనందరికీ తెలుసు. అసలింతకీ మోదీ అజెండా ఏమిటో తెలియడంలేదు" అంటూ వ్యాఖ్యలు చేశాడు. 
 
ఒకప్పుడు పాకిస్థాన్ జట్టు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉండేదని గుర్తు చేశాడు అఫ్రిది. భారత్ స్థిరమైన వ్యవస్థలతో క్రీడలతో పాటు అన్ని రంగాలను చక్కదిద్దుకుని ముందుకు వెళ్లగా, పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, దార్శనికత లేకపోవడం వంటి కారణాలతో బాగా వెనుకబడిపోయిందని అఫ్రిది వ్యాఖ్యానించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు