ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఠాగూర్

బుధవారం, 17 సెప్టెంబరు 2025 (19:33 IST)
మంచి ఆరోగ్యం కోసం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య చిట్కా ఒకటి చెప్పారు. మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కరూ చక్కెర, ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "స్వస్త్ నారీ - సశక్త్ పరివార్" అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
బుధవారం కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన "స్వస్త్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చెక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 13944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 
 
ఈ రోజు నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాతాయని వెల్లడించారు. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారని వెల్లడించారు. గైనకాలజీ, ఈఎన్టీ, కళ్ళు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని, అందువల్ల ప్రతి మహిళ ఈ వైద్య క్యాంపులకు వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. 
 
మరోవైపు, తమ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడివుందని తెలిపారు. ఈ యేడాది ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19264 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో పేదలకు అండగా నిలిచేందుకు యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చాం అని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్టు తెలిపారు. తీవ్రమైన అనారోరగ్య సమస్యలతో బాధపడే పేదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు