బంగ్లాదేశ్ క్రికెటర్‌ షకీబ్ హాసన్‌కు షాకిచ్చిన ఐసీసీ!!

ఠాగూర్

సోమవారం, 16 డిశెంబరు 2024 (14:34 IST)
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ హాసన్‌కు వేల్స్ అండ్ క్రికెట్ కౌన్సిల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తేరుకోలేని షాకిచ్చింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా బ్యాన్ విధించడం గమనార్హం. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి లీగుల్లో అతడు బౌలింగ్ చేయకుండా నిషేధించింది.
 
'మా జాతీయ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ మాకు సమాచారం అందించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ తోపాటు విదేశాల్లోని మ్యాచ్‌లలో షకీబ్ బౌలింగ్ వేయడానికి అనర్హుడు. అతడి బౌలింగ్ యాక్షన్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో జాతీయ క్రికెట్ ఫెడరేషన్‌లో బౌలింగ్ చేసేందుకు వీల్లేదు' అని బంగ్లా క్రికెట్ బోర్డు తెలిపింది. షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడంతో ఈసీబీ పరీక్షించింది. ఫలితాల్లో మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్లు తేలింది.
 
కాగా, భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ సందర్భంగా 'స్వదేశంలో చివరి టెస్టు' ఆడాలనుందని షకీబ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా షకీబ్ వెళ్లలేదు. మిర్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఫేర్‌వెల్ టెస్టు ఆడలేకపోయాడు. ఇక వన్డే జట్టు నుంచి కూడా మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది. ఇటీవల అఫ్గనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను బంగ్లా కోల్పోయింది. విండీస్ చేతిలో టెస్టు సిరీస్ వైట్‌వాష్ అయింది. ఇపుడు ఐసీసీ అతనిపై వేటు వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు