సౌరవ్ గంగూలీకి బెదిరింపులు.. ఆ ఫంక్షన్‌కి హాజరైతే.. చంపేస్తాం..

మంగళవారం, 10 జనవరి 2017 (12:23 IST)
భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీకి జెడ్.ఆలం అనే వ్యక్తి బెదిరింపు లేఖ పంపాడు. మిడ్నాపూర్‌లోని విద్యా సాగార్ యూనివర్శిటీలో జనవరి 19న జరిగే అంతర్ కళాశాలల క్రికెట్ మీట్‌కు హాజరైతే చంపేస్తామని ఆలం గంగూలీ తల్లి నిరుపమకు లేఖ రాసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆ లేఖలో ‘ఈ కార్యక్రమానికి మీ కుమారుడు రాకుండా చూడండి. ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీరు మళ్ళీ మీ కుమారుడిని చూడబోరు’ అని రాశాడు. 
 
సౌరవ్ గంగూలీ సైతం ఈ హెచ్చరిక ఉత్తరం జనవరి ఏడో తేదీన అందిందని.. ఈ విషయాన్ని నిర్వాహకులకు.. పోలీసులకు కూడా తెలిపానని ధ్రువీకరించాడు. విద్యాసాగర్ యూనివర్శిటీ, జిల్లా క్రీడా సంఘం జనవరి 19 నిర్వహిస్తున్న అంతర్ కళాశాల క్రికెట్ టోర్నమెంటుకు గంగూలీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గంగూలీ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయని సిఎబి అధ్యక్షుడు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంగూలీ తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి