భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అనురాగ్‌తో పాటు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేపైనా న్యాయస్థానం వేటువేసింది. లోథా కమిటీ సంస్కరణల అమలుకు మొండికేస్తున్న బీసీసీఐపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది.
అసమ్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్‌ను హెచ్చరించింది. అయినప్పటికీ.. బీసీసీఐ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో మరోమారు విచారణ చేపట్టిన కోర్టు.. బీసీసీఐ అధ్యక్షుడు, సెక్రటరీలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.