భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత పోరాటం చేసి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీ ముందు అరుదైన రికార్డు ఉంది. ట్వంటీ20 టోర్నీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మరో 28 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్థనే 1016 పరుగుల తేడాతో అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ 989 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో 28 పరుగులు చేస్తే ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు బద్ధలు కొడతాడు.
కాగా, ఈ టీ20 సిరీస్ అనగానే విరాట్ కోహ్లీ పేరు మార్మోగిపోతోంది. గతంలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఆడిన 23 మ్యాచ్‌లలో ఆయన 12 అర్థ సెంచరీలు సాధించగా, 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు.