అమీతుమీ తేల్చుకోనున్న భారత్ - కివీస్: కోహ్లీ సేనకు పరీక్షే!
ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:05 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్‌కు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్‌తో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
ఇక నుంచి ప్రతీ మ్యాచ్ భారత్‌కు సవాల్ కానుంది. అందుకే లోటుపాట్లను సరిచూసుకుని బరిలోకి దిగాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌తో పాటు అఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్ బెర్త్‌పై భారత్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడి మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా పాక్.. కివీస్ ఫలితాలపై ఆధారపడాల్సిన ఆగత్యం ఏర్పడుతుంది.
కాగా, ఆరంభ మ్యాచ్‌లో భారత్ ఆడిన తీరు అందరినీ నిరుత్సాహపరిచింది. బౌలర్లయితే పాక్ జట్టులో కనీసం ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయారు. స్లో పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలనే అవగాహన కూడా కరువైంది. అదే అఫ్ఘాన్ బౌలర్లు పాకిస్థాన్ జట్టుకు దాదాపు ఓటమి రుచిని చూపించగలిగారు.
ఇపుడు న్యూజిలాండ్ జట్టుపై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే భారత్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. షహీన్ మాదిరే స్వింగ్ బౌలింగ్‌తో హడలెత్తించే బౌల్ట్‌ను బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటారనే దానిపై భారీ స్కోరు ఆధారపడి ఉంది.
ఓపెనర్లు రోహిత్, రాహుల్ పవర్‌ప్లేలో వికెట్ కోల్పోకుండా ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్యకుమార్ ఎదురుదాడికి దిగితే తిరుగుండదు. అయితే ఓపెనింగ్‌లో కుడి.. ఎడమ చేతి బ్యాటర్స్ ఉంటే మేలని భావిస్తే రోహిత్‌కు జతగా ఇషాన్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు.
నెట్స్‌లో హార్ధిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఆరో బౌలర్ కొరతను తీర్చనుంది. పేసర్ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే జట్టులో మార్పులు లేకపోవచ్చని సమాచారం.
మరోవైపు, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ మెరుగ్గానే రాణించింది. కానీ చివర్లో ఆసిఫ్ అలీ ధాటికి ఓటమి చెందాల్సి వచ్చింది. అయితే డారిల్ మిచెల్ ఓపెనర్‌గా.. నీషమ్‌ను నాలుగో నెంబర్‌లో ఆడించే ప్రయోగం బెడిసికొట్టింది. డెత్ ఓవర్లలో చక్కటి ఫినిషర్ లేకపోవడం జట్టుకు లోటే. డెవాన్ కాన్వే హిట్టింగ్‌పై కివీస్ భారీ స్కోరు ఆధారపడి ఉంది. విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగం బౌల్ట్, సౌథీ, సోధీ, శాంట్నర్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది.