వార్మప్ మ్యాచ్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. పూర్తి ఫామ్‌లోకొచ్చిన కోహ్లీ

సోమవారం, 29 మే 2017 (01:51 IST)
ఆరంభంలోనే విజయంతో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వామప్ మ్యాచ్‌‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌ తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రాణించాడు. 55 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. భారత్‌ స్కోరు 26 ఓవర్లలో 1293 వద్ద వర్షం కురవడంతో మ్యాచ్‌‌కు అంతరాయం ఏర్పడింది. అయితే మ్యాచ్‌‌కు వర్షం పూర్తిగా ఆటంకం కలిగించడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం 45 పరుగులతో భారత్‌ విజేతగా నిలిచింది. అంతకు ముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 38.4 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది.
 
వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ పేస్‌ విభాగానికి న్యూజిలాండ్‌ తలవంచింది. ఓపెనర్‌ లూక్‌ రోంచి (6 ఫోర్లతో 63), చివర్లో నిషమ్‌ 46 పరుగులతో రాణించడంతో కివీస్‌ భారత్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోని మహ్మద్‌ షమీ.. గప్టిల్‌(9), విలియమ్సన్‌(8), బ్రూమ్‌ (0)లను పెవిలియన్‌ చేర్చి కివీస్‌ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌లు మూడేసి వికెట్లతో చెలరేగారు. జడేజా 2 వికెట్లు తీయగా, అశ్విన్‌ , ఉమేశ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.
 
190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ ఓపెనర్‌ రహానె (7) వికెట్‌ ను త్వరగా కోల్పోయింది. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (40; 59 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (0) డకౌట్‌ అయ్యాడు. కోహ్లీ (55 బంతుల్లో 52 నాటౌట్‌ 6 ఫోర్లు), ధోనీ (21 బంతుల్లో 17 నాటౌట్‌) క్రీజులో ఉండగా వర్షం కురిసింది. అప్పటికీ 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి టీమిండియా 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 45 పరుగులతో భారత్‌ గెలిచినట్లు ప్రకటించారు. చాంపియన్స్‌ ట్రోఫీ పర్యటనలో తొలి మ్యాచ్‌ విజయం సాధించడంపై కోహ్లీ సేన ఉత్సాహం రెట్టింపయింది.
 

వెబ్దునియా పై చదవండి