జాదవ్ వికెట్ తీస్తే వెంటనే విమానం ఎక్కి కివీస్ వెళ్ళిపోతా: స్టైరిస్ మాటలకు నవ్వు ఆపుకోలేక...

బుధవారం, 26 అక్టోబరు 2016 (10:10 IST)
భారత్, న్యూజిలాండ్ మధ్య మొహాలిలో ఆదివారం నాడు జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మైదానం మొత్తం ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది. మ్యాచ్ ప్రోసిడింగ్స్‌ గురించి రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ ప్రేక్షుకలకు వివరిస్తున్నారు.
 
జాదవ్ గురించి స్టైరిస్ మాట్లాడుతూ.. ఈ రోజు జాదవ్ గనుక వికెట్ తీస్తే వెంటనే విమానం ఎక్కి న్యూజిలాండ్ వెళ్లిపోతానని చెప్పాడు. ఇలా అన్నాడో లేదో తాను వెంటనే 13వ ఓవర్ చివరి బంతికి కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఇంకేముంది జాదవ్ వికెట్ తీయడంతో స్కాట్ స్టైరిస్ తాను వెళ్లిపోతున్నాని చెప్పి మైక్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. అయితే న్యూజిలాండ్‌కు వెళ్లాడో తెలియదు గానీ కామెంటరీ బాక్స్‌ నుంచి మాత్రం బయటకు వెళ్లాడు. 
 
ఈ సన్నివేశాన్ని అక్కడే ఉండి గమనిస్తున్న రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ నవ్వు ఆపుకోలేక పోయారు. అయితే ఈ విషయం ఇక్కడితో ముగియలేదు. స్టైరిస్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. దీంతో చివరకు తాను దాక్కున్నానంటూ స్పందించాడు స్టైరిస్. మూడో వన్డేలో 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ధోని 80, విరాట్ కోహ్లీ 154 పరుగులతో రాణించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.

వెబ్దునియా పై చదవండి