బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లగునియా రఘుకాంత్ గ్రామంలో 30 యేళ్ల సోను కుమార్ ఆటో డ్రైవర్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్నాడు. సోను కుమార్‌ను అతని భార్య స్మితా ఝా హత్య చేసివుంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి స్మిత ఝాను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అయితే, ఈ హత్యపై మృతుడు సోను కుమార్ తండ్రి టుంటున్ ఝా మాట్లాడుతూ, తన కుమారుడి హత్యకు వారి వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలే కారణమని ఆరోపించారు. సోను, స్మితలకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. అయితే, వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సమస్యలు తీవ్రంకావడంతో స్థానిక పంచాయితీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారని, పూర్వం కూడా జరిగిందని టుంటున్ ఝా వివరించారు.
అయితే, సోను అన్నయ్య పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ట్యూటర్ తిరిగి రావడంతో మళ్లీ ఆ దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోను తండ్రి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడని, అప్పటికే తాను నిద్రపోయానని టుంటన్ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం సోను తన గదిలో విగతజీవిగా పడి ఉన్నాడని, కోడలు స్మిత మాత్రం ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుని ఉందని చెప్పాడు. దగ్గరికి వెళ్లి చూడగా, సోను మెడపై గాయాలు స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. స్మిత మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సహాయంతో సోనును హత్య చేసి ఉంటుందని ఆయన ఆరోపించాడు.