ఐపీఎల్ చరిత్రలో తొలిసారి .. అన్నదమ్ముల సవాల్‌!

ఆదివారం, 7 మే 2023 (14:41 IST)
ఐపీఎల్ చరిత్రలో అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సోదరులుగా మాత్రం హర్దిక్ పాండ్య, కృనాల్‌ పాండ్య రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ నాయకత్వం వహిస్తుండగా..  తాజాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీతో కృనాల్ పాండ్య లక్నో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వీరి మధ్య పోరు ఎలా ఉండనుందోననే ఆసక్తిగా మారింది. 
 
రెగ్యులర్ సారథి కేఎల్ రాహుల్‌ లేకపోవడం లక్నోకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు గొప్పగా రాణించలేకపోయారు. ఆ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడం వల్ల కనీసం ఒక్క పాయింట్‌తోనైనా సరిపెట్టుకోగలిగింది. ఇలాంటి సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌కు లక్నో అడ్డుకట్ట వేయాలంటే మరింత శ్రమించాలి.
 
అప్పుడే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. కెప్టెన్సీ చేపట్టిన కృనాల్‌ పాండ్య మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. గత సీజన్‌లో రెండు సార్లు, ఈ సారి ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో ఇరు జట్లూ తలపడ్డాయి. మూడింట్లోనూ గుజరాతే విజయం సాధించడం గమనార్హం. ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో లక్నో బరిలోకి దిగనుంది. 
 
కేఎల్‌ రాహుల్‌ స్థానంలో కరుణ్‌ నాయర్‌ వచ్చినప్పటికీ.. తుది జట్టులో మాత్రం డికాక్‌ వచ్చే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రాతో కూడిన స్పిన్‌ త్రయం గుజరాత్‌ బ్యాటర్లను అడ్డుకోగలిగితే లఖ్‌నవూ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
 
గుజరాత్ టైటాన్స్‌ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండటంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించి ప్లేఆఫ్స్ రేసులో ముందుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానం వరకూ అదరగొట్టగలిగే ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు చేజేతులా ఓటములను చవిచూసింది. రాజస్థాన్‌పై రెచ్చిపోయిన కెప్టెన్ హార్దిక్‌ పాండ్య.. అంతకుముందు ఢిల్లీపై మాత్రం నిదానంగా బ్యాటింగ్‌ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 
 
బౌలింగ్‌లో రషీద్, నూర్ అహ్మద్‌, షమీ, మోహిత్ శర్మ, హార్దిక్‌ ప్రత్యర్థులను కట్టడి చేసేస్తున్నారు. అయితే, లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ ఆడని క్వింటన్‌ డికాక్‌ పరుగుల దాహంతో ఉన్నాడు. ఇక కేల్‌ మేయర్స్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్‌ అద్భుత ఫామ్‌తో పరుగులు చేస్తున్నారు. 
 
జట్లు (అంచనా)
గుజరాత్ : శుభ్‌మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్),  విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్‌ ఖాన్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ
 
లక్నో : క్వింటన్ డికాక్, కేల్ మేయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్‌ పూరన్, కృనాల్ పాండ్య (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్‌ ఖాన్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు