రవిశాస్త్రే నాకు సరి జోడి! నాకే ఇబ్బంది ఉండదు.. కుంబ్లేతో కుదరలేదన్న కోహ్లీ

గురువారం, 20 జులై 2017 (05:29 IST)
లెజెండరీ కెప్టెన్, బౌలర్ అనిల్ కుంబ్లేని ఘోరంగా ఆవమానించి జట్టు కోచ్ పదవినుంచి సాగనంపిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  కొత్త కోచ్ రవిశాస్త్రితో పనిచేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చని ఆశాభావం వ్యక్తపరిచాడు. గతంలోనూ తమ మధ్య మంచి సమన్వయం కొనసాగిందని అతను గుర్తు చేశాడు. 
 
‘2014 నుంచి 2016 వరకు వరుసగా మూడేళ్ల పాటు కలిసి రవి నేనూ పని చేశాం. కాబట్టి మంచి అవగాహన ఉండటం సహజం. కొత్తగా నేను ఆయనను అర్థం చేసుకోవడానికేమీ లేదు. ఒకరి నుంచి మరొకరం ఏం ఆశిస్తున్నామో, అందుబాటులో ఎలాంటి వనరులు ఉన్నాయో ఇద్దరికీ బాగా తెలుసు. సమన్వయం కోసం కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
 
భారత క్రికెట్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తనపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండదని విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. మైదానం బయట చోటు చేసుకునే ఘటనలు జట్టుపై ప్రభావం చూపించవని అతను స్పష్టం చేశాడు.  
 
‘కొన్ని సార్లు ఏం జరగాలో అది కచ్చితంగా జరిగి తీరుతుందని నేను నమ్ముతాను. ఇలాంటి వాటి వల్ల నాపై అదనపు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక జట్టుగా  ఏం సాధించాలనే దానిపైనే మేం దృష్టి పెడతాం. గతంలోనూ అందరూ క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. విమర్శలకు గురి కావడం మాకు కొత్త కాదు. నా బాధ్యతలను నేను ఎప్పుడూ భారంగా భావించను’ అని కోహ్లి స్పష్టం చేశాడు. 
 
తాను కెప్టెన్‌గా ఉన్నంత వరకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా దానిని నెరవేరుస్తానని, పాత విషయాలను మనసులోంచి తుడిచేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అతను అన్నాడు.‘ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనేది ఆటలోనే కాదు జీవితంలో కూడా బాగా పని చేస్తుంది. నేను దానిని పాటిస్తాను. ప్రతీ ఒక్కరికి జీవితంలో సంబంధాలు కొనసాగించే విషయంలో ఈ తరహా అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. సహకారం, సమన్వయం ఎంత కీలకమో అప్పుడే తెలుస్తుంది’ అని విరాట్‌ విశ్లేషించాడు.
 
అనిల్ కుంబ్లే వ్యవహారం ఇప్పటికీ భారత క్రికెట్ వర్గాల్లో దుమారం లేపుతున్న నేపథ్యంలో కుంబ్లేకూ తనకూ మధ్య సరైన అవగాహన లేదన్న విషయాన్ని కోహ్లీ చెప్పకనే చెప్పాడు. 
 

వెబ్దునియా పై చదవండి