అనిల్ భాయ్ తప్పుకోవాలని నిర్ణయించారు. దాన్ని గౌరవిస్తున్నాను. బయటికి చెప్పలేనన్న కోహ్లీ

శుక్రవారం, 23 జూన్ 2017 (05:13 IST)
భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే వైదొలిగిన అనంతరం జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిసారి నోరువిప్పాడు. కుంబ్లేకు, తనకు మధ్య జరిగినదాని గురించి మాట్లాడాడు. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌ సిరీస్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. కోహ్లితో విభేదాలు, అతని మంకుపట్టు వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం 'కోచ్‌ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్‌ భాయ్‌ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు' అంటూ తన మౌనాన్ని తొలిసారి వీడారు.
 
కుంబ్లే తప్పుకోవడానికి కారణం ఏమిటి అసలు చాంపియన్‌ ట్రోఫీ సందర్భంగా డ్రెసింగ్‌ రూమ్‌లో ఏ జరిగిందన్న ప్రశ్నలకు కోహ్లి నేరుగా సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయని, డ్రెసింగ్‌ రూమ్‌కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ఈ ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు. డ్రెసింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, అది జట్టు వ్యక్తిగత విషయమని, దాని గురించి బయటకు చెప్పలేనని పేర్కొన్నాడు. డ్రెసింగ్‌ రూమ్‌ గౌరవాన్ని, పవిత్రతను తాను కాపాడానని, తనెప్పుడూ గౌరవప్రదంగా వ్యవహరించినట్టు కోహ్లి చెప్పుకొచ్చాడు.
 
ఒకటి మాత్రం చెప్పగలను. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో నేను 11 ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగినా దాని పవిత్రతను మేం గత నాలుగేళ్లుగా కాపాడుతూ వచ్చాం.  టీమ్ మొత్తంగా గూడా దానిపై విశ్వాసం ఉంచింది. డ్రెస్సింగ్ రూమ్ మా దృష్టిలో పరమపవిత్రమైనది అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన విషయాలను బహిరంగంగా నేను వ్యక్తం చేయలేను. అక్కడే అనిల్ తన అభిప్రాయం చెప్పారు. ఆ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం అని కోహ్లీ చెప్పాడు.
 
నా పనితీరుపై టీమిండియా కెప్టెన్ కొన్ని రిజర్వేషన్లు ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో కోచ్‌గా నా బాధ్యతలను సీఏసీలో కానీ, బీసీసీఐలో కాని అర్హులైన వారికి ఇవ్వడమే ఉత్తమమని నమ్ముతున్నాను అంటూ అనిల్ కుంబ్లే ప్రకటించిన ఏక వాక్య ప్రకటన ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే.
 

వెబ్దునియా పై చదవండి