భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ జట్టు విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై గెలిచి బోణీ కొట్టింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది. అయితే వరుసగా పదో వన్డేలో నెగ్గి రికార్డు సృష్టించాలనుకున్న కోహ్లీసేన కల నెరవేరలేదు.
దుర్గాష్టమి రోజు టీమిండియా విజయ ‘దశమి’ని చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్-రహానె మళ్లీ శతక భాగస్వామ్యంతో గట్టి పునాది వేసినా.. కేదార్, హార్దిక్ మెరుపులతో విజయానికి చేరువైనా.. చివర్లో తడబడిన భారత్ విజయం సాధించలేకపోయింది.
ఆస్ట్రేలియా స్కోర్: 334/5 (50 ఓవర్లలో)
భారత్ స్కోర్: 313/8 (50 ఓవర్లలో)
టీమిండియా బ్యాటింగ్ : రహానె (53), రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (21), పాండ్యా (41), జాదవ్ (67), ఎంకే పాండే (33), ధోనీ (13), పటేల్ (5), మహ్మద్ షమీ 6 పరుగులతో, ఉమేష్ యాదవ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ - 1, కౌల్టర్ - నీల్ - 2, రిచర్డ్ సన్ - 3, జాంపా - 1 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు వార్నర్, ఫించ్ కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చారు.
గత మ్యాచ్‌లో శతక్కొట్టిన ఫించ్ ఫామ్‌ను కొనసాగించగా.. వందో వన్డేలో వార్నర్ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్ ఆడాడు. ఈ ఇద్దరూ 35 ఓవర్లలో తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడంతో ఆసీస్ సులభంగా 400 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, భారత బౌలర్లు చివర్లో మరోసారి గొప్పగా పుంజుకున్నారు. చివరి 15 ఓవర్లలో 103 పరుగులే ఇచ్చి ఆసీస్‌ను కట్టడి చేశారు.
అయితే, ఆరంభంలో మాత్రం ఫించ్ (94), వార్నర్ (124) ఆతిథ్య బౌలర్లకు సింహస్వప్నమయ్యారు. హ్యాండ్స్‌కోంబ్ (30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 43), స్టొయినిస్ (9 బంతుల్లో 15 నాటౌట్) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించింది.