పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్న ఆయేషా, ఆమె తండ్రి సిద్ధీఖీలపై పాకిస్థానీ ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు. ఒకవైపు తన కుమార్తె ఆయేషాను షోయబ్ మాలిక్ మోసం చేశాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తుండగా, మరోవైపు పాక్ మాజీ క్రికెటర్లు కూడా షోయబ్ మోసగాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
మాలిక్ తన కుమార్తెను నమ్మించి మోసం చేశాడని, అతనో అబద్ధాల కోరని ఆయేషా కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. ఇంకా అయేషాతో షోయబ్ వివాహాన్ని నిరూపిస్తూ నిఖానామాను కూడా ఇటీవల విడుదల చేశారు.
కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టుకు ఎదురైన ఘోర పరాజయం చవిచూడటంతో ఆ దేశ క్రికెటర్లలో పలువురిపై పీసీబీ నిషేధం వేటు వేసింది. ఇందులో భాగంగా.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డరాని తేలడంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకరిగా పరిగణించే మహ్మద్ యూసుఫ్, యూనిస్ఖాన్లపై జీవితకాలం నిషేధం విధించింది.
అంతేగాక పేలవమైన ఆటను ప్రదర్శించారనే కారణంతో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, ఆల్‌రౌండర్ రాణా నవీద్‌పై ఏడాదిపాటు నిషేధాన్ని విధించింది. దీంతోపాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారనే కారణాలపై అక్మల్ సోదరులు కమ్రాన్, ఉమర్‌లకు దాదాపు రూ.30 లక్షల చొప్పున భారీ జరిమాన విధించించింది.
ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ క్రికెట్ కెరీర్లోనూ పేలవమైన ఆటతీరుతో జట్టు పరాజయానికి కారణమయ్యాడని, అలాగే వ్యక్తిగత జీవితంలో ఆయేషాను మోసం చేశాడని పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్ మాలిక్ వివాహం ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీన వివాహా రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు మాలిక్ వారు చెప్పారు.