అలా ఆడటం..యువీ దగ్గర నుంచి నేర్చుకున్నా: రోహిత్ శర్మ

FILE
క్రీజులో నిలకడగా ఆడే విధానాన్ని టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ నుంచి నేర్చుకున్నానని ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌‌లో ఆడే టీం ఇండియా జట్టుకు ఎంపికైన రోహిత్ శర్మ అన్నాడు. తాను ఆక్రోషంతో బ్యాటింగ్‌లో రాణించేందుకు యువీ నేర్పించిన కొన్ని మెలకువలే ప్రధాన కారణమని రోహిత్ శర్మ వెల్లడించాడు.

టీం ఇండియా నుంచి తనను సెలక్టర్లు తప్పించిన సమయాల్లో యువరాజ్ సింగే తనకు పరస్థితిని నచ్చజెప్పేవాడని రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టుకు ఎంపిక కాలేదనే ఆవేదనలో ఉన్నప్పటికీ.. హ్యాపీగా గడిపేయాలని యువీ సూచించేవాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన బ్యాటింగ్ వెనుక ఉన్న గొప్ప శక్తి యువరాజేనని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైమండ్స్, లీ మెన్‌ల వద్ద కొంచెం నేర్చుకున్నానని, కానీ యువరాజ్ సింగ్ వద్ద ఆటలోని మెలకువలను ఎక్కువగా గ్రహించానని రోహిత్ శర్మ అన్నాడు. ఒక జట్టును విజయం దిశగా నడిపించేందుకు కెప్టెన్ ఏ రీతిలో ఆలోచిస్తాడో..? అదే రీతిలో మనం కూడా యోచించాలని యువరాజ్ సింగ్ చెప్పేవాడని శర్మ వెల్లడించాడు.

అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచనలు తనకెంతో సహాయపడ్డాయని రోహిత్ శర్మ అన్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో ఓ క్రికెటర్ శరీరాకృతిని ఎలా ఉంచుకోవాలనే అంశంపై సచిన్ ఇచ్చిన సూచనలతోనే తానీస్థాయికి ఎదిగానని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే.. ఏప్రిల్ 20వ తేదీ ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆడే టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యానని రోహిత్ గుర్తు చేశాడు. ఐపీఎల్‌పై పూర్తి దృష్టి పెట్టిన తనకు టీం ఇండియా తరపున ఆడే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. కాగా.. 2007వ సంవత్సరం ప్రపంచకప్‌ను సాధించిన భారత్, ఈ సంవత్సరం కూడా ధోనీ సేన కప్‌ గెలుచుకుంటుందని రోహిత్ శర్మ నమ్మకం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి