ఆరు నెలల్లో క్రికెట్ పోటీలు: పిసిబి

సోమవారం, 9 మార్చి 2009 (09:35 IST)
వచ్చే ఆరు నెలల్లో పాకిస్థాన్ గడ్డపై యధావిధిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇయాజ్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఆదివారం లండన్‌లో మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో విదేశీ జట్లు పాల్గొనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు. అలాగే, 2011 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను కూడా నిర్వహించి తీరుతామన్నారు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు భీకర దాడులపై ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

మరో ఆరు నెలల్లో తమ గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని భావిస్తున్నట్టు చెప్పారు. దీనికి ఆరు లేదా తొమ్మిది నెలల సమయం పట్టవచ్చన్నారు. తమ దేశంలో అడుగుపెట్టే విదేశీ క్రికెట్ ఆటగాళ్లకు గట్టి భద్రతను తమ దేశ ప్రభుత్వం కల్పిస్తుందని తాను హామీ ఇస్తున్నట్టు చెప్పారు. లాహోర్ వంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృత్తం కాబోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భద్రతపై ప్రభుత్వం గట్టి హామీ ఇచ్చేంత వరకు ఏ జట్టును ఆహ్వానించబోమన్నారు.

వెబ్దునియా పై చదవండి