మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మూడో సీజన్లో భాగంగా మంగళవారం రాత్రి 37వ లీగ్ మ్యాచ్లో చెన్నై చేతిలో పరాజయం పాలవడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం ఒకందుకు మేలేనని చెబుతున్నాడు.
కానీ ఈ పరాజయంతో భయపడాల్సిన అవసరం లేదని జట్టు సభ్యులకు సచిన్ సూచించాడు. వరుస పరాజయాలతో ముందుకు దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ ఆటతీరులో ఇంకా మెలకువ వహించాలని చెప్పే రీతిలో ఈ ఓటమి తమ జట్టును మేల్కొలిపిందని సచిన్ వ్యాఖ్యానించాడు.
తమ జట్టు ఫీల్డింగ్, బ్యాటింగ్ తీరును ఇంకా మెరుగు పరుచుకోవాలని, కానీ తప్పకుండా తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాణిస్తుందని కెప్టెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో ధోనీసేన అద్భుతంగా ఆడిందని సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.