ఇంగ్లండ్‌ జట్టు కోచ్ రేసులో మైక్ ఆర్థర్!

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న మైక్ ఆర్థర్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, ఈ వార్తలను తోసిపుచ్చలేదు. దీంతో అతను ఇంగ్లండ్ జట్టుకు తదుపరి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లయింది. 2005 మేలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆయన కోచ్‌గా నియమింపబడ్డాడు. అదే ఏడాది జనవరిలో ఉద్వాసనకు గురైన పీటర్ మూర్స్ స్థానంలో ఆర్థర్‌ను నియమించారు.

ఈ సందర్భంగా ఆర్థర్ మాట్లాడుతూ, "క్రికెట్ ఆటకు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం ఎంతో బాధ్యతతో కూడుకున్న పని. గత ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాయాలంటే... జట్టుకు నైపుణ్యమైన నిర్దేశకుడు అవసరం. ఆ సత్తా నాకు ఉందని ఇంగ్లండు క్రికెట్ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలిసింది. వారు నన్ను సంప్రదిస్తే ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను" అన్నారు.

అయితే 2011 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా ఆర్థర్ బాధ్యతలు నిర్వహించాలని కాంట్రాక్టు ఉంది. అప్పటి వరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పాడు.

కాగా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తయారు చేసిన జాబితాలో ఆ జట్టు తాత్కాలిక కోచ్ ఆండీ ఫ్లవర్, వెస్టిండీస్ కోచ్ జాన్ డైసన్, కెంట్‌కు చెందిన గ్రాహం ఫోర్డ్, భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ జాన్ రైట్‌లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి