ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండో సీజన్ ప్రారంభోత్సవ మ్యాచ్ ఏప్రిల్ 10వ తేదీన జరుగనుంది. అయితే తొలుత అనుకున్నట్టుగా జైపూర్‌లో కాకుండా, ముంబైలో ఐపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ జరుగుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ నిర్వాహకులు హోం మంత్రిత్వ శాఖకు అందజేసిన సవరించిన షెడ్యూల్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.
అలాగే, గత 2008లో మ్యాచ్‌లు నిర్వహించిన ఎనిమిది నగరాలతో పాటు, నాగపూర్, విశాఖపట్నం, కటక్, రాజ్‌కోట్, ఇండోర్‌లలో రెండో సీజన్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. పూర్తిగా సవరించిన కొత్త షెడ్యూలు త్వరలోనే విడుదల అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వెల్లడించారు.
రెండో సీజన్ ప్రారంభ, ముగింపు పోటీల తేదీలలో మార్పు ఉండదని, మధ్యలో జరిగే మ్యాచ్‌ల నిర్వహణ తేదీల్లో మాత్రమే మార్పులు చేర్పులు చేస్తామని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజుల్లో మ్యాచ్‌లు ఉండబోవని, ఆటగాళ్లు, స్టేడియంల భద్రత కోసం ప్రైవేటు సంస్థలను వినియోగిస్తామని మోడీ వెల్లడించారు.