ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల ఎంపిక 21కి వాయిదా!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు కొత్త ఫ్రాంచైజీల ఎంపికను వాయిదా వేశారు. ఇప్పటివరకు బిడ్డింగ్ కోసం దాఖలు చేసిన టెండర్లు చెల్లవని, మళ్లీ కొత్తగా టెండర్లు వేయాలని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్‌మోడీ స్పష్టం చేశారు.

ఆదివారం ముంబైలో సమావేశం అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కొత్త ఫ్రాంచైజీల ఎంపికను మార్చి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 9వ తేది ఉదయం నుంచి మార్చి 21 వరకు బిడ్డింగ్‌ల కోసం టెండర్లు వేసుకోవచ్చని తెలిపారు. అదే రోజు చెన్నైలో ఉదయం 11 గంటలకు బిడ్డింగ్‌లను ప్రకటిస్తామని మోడీ వెల్లడించారు.

ఇకపోతే.. కొత్త జట్లలో అహ్మదాబాద్‌, పుణెలు రేసులో ముందున్నాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌లో అగ్రగామి వీడియోకాన్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ పుణె కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ కోసం మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌తోపాటు మరో బాలీవుడ్‌స్టార్‌ అజయ్‌ దేవగన్‌, గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీలు పోటీ పడుతున్నారు. అలాగే సహారా గ్రూప్‌, జేపీ గ్రూప్‌, ఐసీఐసీఐ కంపెనీలు ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, అత్యధిక మొత్తానికి బిడ్డింగ్‌ దాఖలు చేసిన వారికి కొత్త జట్లు దక్కుతాయి. ఒక్కోక్క జట్టుకు కనీస ధర 225 మిలియన్‌ డాలర్లు (రూ.1012 కోట్లు)గా నిర్ణయించారు. బిడ్‌తో పాటు ప్రతి జట్టు 100 మిలియన్‌ డాలర్లు (రూ.450 కోట్లు) బ్యాంక్‌ గ్యారంటీ చూపించాల్సిన అవసరం ఉంది.

వెబ్దునియా పై చదవండి