డబ్బులు పంట పండిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ సమగ్ర వివరాలను సేకరించేందుకు ముమ్మర చర్యలు చేపడుతోంది. మొన్నటివరకు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కార్యాలయం, ఐపీఎల్ ఆఫీసుల్లో తనీఖీలు చేపట్టిన ఆదాయ పన్ను శాఖ.. తాజాగా ఐపీఎల్ క్రికెట్ పోటీలను ప్రసారం చేసిన టీవీ కేంద్రాలపై దాడికి దిగింది.
ఐపీఎల్‌లో పలు ఆసక్తి కర అంశాలు వెలికి రావడంతో ఐపీఎల్ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ఐటీ శాఖాధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన టీవీ కేంద్రాలకు ఐపీఎల్ యాజమాన్యం చెల్లించిన మొత్తం, వాటి డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసిన మల్టీ స్క్రీన్ మీడియా, వోల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ వంటి పలు ప్రసార కేంద్రాలపై ఐటీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో వరల్డ్ స్పోర్ట్ గ్రూప్, మల్టీ స్క్రీన్ మీడియాల వద్ద కీలక పాత్రలతో పాటు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఐటీ అధికారులు దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్నారు.