తెలంగాణ రాష్ట్రంలో ఓ వైద్యుడి నిర్వాకం గుట్టు వెలుగులోకి వచ్చింది. గర్భవతులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడపిల్ల అని నిర్ధారణ అయితే, ఆ వెంటనే అబార్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన ఈ లింగ నిర్ధారణ పరీక్షలు స్థానికంగా కలకలం రేపాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడంతో వెలుగులోకి వచ్చాయి.
ఆసుపత్రి పక్కనే ఉన్న ఎస్ఎల్ఎన్ ల్యాబ్‌లో లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆ ల్యాబ్ నిర్వాహకుడు, రేడియాలజిస్టు డాక్టర్ పాండుగౌడ్ పాటు శివకుమార్ భార్య డాక్టర్ గాయత్రిపై కేసులు నమోదు చేసి.. నోటీసులు జారీచేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
అబార్షన్ జరిగిన మహిళల్లో ఒకరిది భువనగిరి మండలంలోని వీరవల్లి కాగా మరొకరిది తుర్కపల్లి మండలం పెద్దతండాగా గుర్తించారు. వారిద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరికీ ఆడ పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పీసీపీఎన్డీటీ (ప్రీకన్సెప్షన్, ప్రీనాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్) ప్రోగ్రాం అధికారి డాక్టర్ యశోద ఆధ్వర్యంలో బృందం ఆసుపత్రిని, ల్యాబ్‌ను తనిఖీ చేసింది.