ఐపీఎల్ సమరం: ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ విజయం!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటా జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎట్టకేలకు విజయం సాధించింది.

ఈడెన్ గార్డన్స్‌లో ఆదివారం జరిగిన 34వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో గంగూలీ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పటికే సెమీస్ ఆశలను చేజార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఐపీఎల్ పట్టికలో కేవలం నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది.

బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ సేనలో క్రిస్‌గేల్‌ (88: 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్‌ 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదింఛి, తన ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

కేకేఆర్ ఆటగాళ్లలో మనోజ్ తివారీ-క్రిస్ గేల్ భాగస్వామ్యం అదిరింది. తొలుత 24 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన క్రిస్ గేల్ వరుస సిక్స్‌లతో కేవలం 30 బంతుల్లోనే అర్థ సెంచరీని నమోదుచేసుకున్నాడు. ఇంకా బొపారా బౌలింగ్‌లో 13వ ఓవర్లోనే మొత్తం 33 పరుగులు రావడం విశేషం.

ఇందులో తొలి బంతికి తీవారీ సింగిల్స్ తీయగా, ఆ తర్వాతి నాలుగు బంతులను గేల్ సిక్స్‌లతో అదరగొట్టాడు. ఇక చివరికి తివారీ సింగిల్‌ తీయడంతో ఓవర్ ముగిసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులొచ్చిన ఓవర్ ఇదే కావడం గమనార్హం.

పంజాబ్ ఆటగాళ్లలో ఓపెనర్‌ జయవర్ధనే (110 నాటౌట్‌: 59 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీ చేయగా, సంగక్కర (38: 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), యువరాజ్‌ (33 నాటౌట్‌: 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.

ఇకపోతే.. కేకేఆర్ బౌలర్లలో షేన్ బాండ్, మురళీ కార్తీక్‌లు చెరో వికెట్ పడగొట్టగా, పంజాబ్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్, థెరాన్, బొపారలు తలా ఒక్కో వికెట్‌ను సాధించారు.

వెబ్దునియా పై చదవండి