ఐసీసీ ట్వంటీ-20: ఆప్ఘనిస్థాన్‌పై ధోనీసేన తొలి విజయం!

FILE
కరేబియన్ గడ్డపై ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వెస్టిండీస్‌లో జరుగుతున్న ట్వి-20 ప్రపంచకప్‌, తొలి మ్యాచ్‌లో క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థా‌న్‌పై భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆప్ఘనిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.

భారత్ ఆటగాళ్లలో మురళీవిజయ్‌ (48), యువరాజ్‌సింగ్‌ (23), ధోనీ (15) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ నూర్ ఆలీ అద్భుతంగా రాణించాడు. 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో అర్థసెంచరీ (50) చేశాడు. అస్గర్ స్టానిక్‌జై 30 పరుగులు చేసి, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇకపోతే.. భారత బౌలర్లలో నెహ్రా మూడు వికెట్లు పడగొట్టగా, ప్రవీణ్ కుమార్ రెండు, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఆప్ఘన్ బౌలర్లలో హమీద్ హస్సేన్, సమీఉల్లా, అహ్మద్ జై ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా.. ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్లను ఆటాడుకుని మూడు వికెట్లు సాధించిన ఆశిష్ నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి