కివీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఓటమి గండం నుంచి బయటపడింది. నేపియర్‌లో ఈనెల 26వ తేదీన ప్రారంభమైన రెండో టెస్టును సోమవారం డ్రాగా ముగించుకుంది. జట్టు ఓపెనర్ గౌతం గంభీర్, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్.లక్ష్మణ్‌లు సెంచరీలతో రాణించడంతో భారత్ రెండో టెస్టును డ్రాగా చేసుకుని బయటపడింది.
తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల వెనుకబడి ఫాలోఆన్ ఆడిన భారత్ బ్యాట్స్‌మెన్స్ రెండో ఇన్నింగ్స్‌లో తమ బాధ్యతను గుర్తెరిగి బ్యాటింగ్ చేశారు. ఫలింతగా చివరి రోజు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసింది.
మ్యాచ్ ఫలితం తేలదని తెలియడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 619 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెల్సిందే. ఆ జట్టులో టేలర్ (151), రైడర్ (201), మెక్‌కల్లమ్ (115) సెంచరీలతో రాణించి, భారీ స్కోరుకు దోహదపడ్డారు.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభంలోనే తడబడింది. ఫలితంగా 305 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 314 పరుగుల వెనుకబడి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సెహ్వాగ్ వికెట్‌ను జట్టు స్కోరు 30 పరుగుల వద్ద కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది.
అయితే, గంభీర్, ద్రావిడ్‌లు జట్టు ఇన్నింగ్స్‌ను కుదుపటపరిచారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన టెండూల్కర్ కూడా అర్థ సెంచరీతో రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయగలిగింది.
జట్టు విజయం కంటే.. డ్రా చేసేందుకే వీరిద్దరు ప్రాధాన్యం ఇచ్చి, వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా నాలుగో రోజున కివీస్ బౌలర్లు రోజంతా శ్రమించి కేవలం రాహుల్ ద్రావిడ్ (62) వికెట్ మాత్రమే తీయగలిగారు. ఆ తర్వాత 252 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్.. మ్యాచ్ ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసింది.
వీవీఎస్ లక్ష్మణ్ (124), యువరాజ్ సింగ్ (54) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు గంభీర్ 137, సచిన్ 64 పరుగులు చేసి మూడో వికెట్‌కు 103 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా లక్ష్మణ్, యువరాజ్ సింగ్‌లు బ్యాటింగ్ చేసి రెండో టెస్టును డ్రాగా ముగించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును డబుల్ సెంచరీ చేసిన రైడర్ అందుకున్నాడు.