టెస్ట్ ఓడిపోతామనే ఆలోచనే లేదు: సెహ్వాగ్

నేపియర్ టెస్టును తాము ఓడిపోతామనే ఆలోచనే లేదని 'టీమ్ ఇండియా' రెండో టెస్టుకు స్టాండ్‌బై కెప్టెన్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. తమకు ఫాలోఆన్‌ను అప్పగించిన వెంటనే పరిస్థితి ఇండియాకు ప్రతికూలంగా ఉందని అందరూ భావించారని, అయితే, తమకు మాత్రం ఓటమి ఊహే రాలేదన్నాడు. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్కులో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును భారత్ డ్రాగా ముగించుకున్న విషయం తెల్సిందే.

కివీస్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 314 పరుగులు వెనుకబడి ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. జట్టులోని ఓపెనర్ సెహ్వాగ్ మినహా, గంభీర్, ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, యువరాజ్ సింగ్‌లు బాధ్యతాయుతంగా రాణించడంతో భారత్ ఓటమి కోరల నుంచి బయటపడింది.

ఈ మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించినా టెస్ట్‌ను తాము కాపాడుకోగలమనే విశ్వాసం, ఆత్మస్థైర్యం తమలో ఉన్నదన్నారు. లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, గంభీర్ వంటి బ్యాట్స్‌మెన్స్‌ను కలిగిన జట్టుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావన్నారు.

2001, 2004లో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియాతో ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కామని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు స్వదేశంలోనే కాకూండా, విదేశాల్లో సైతం విజయాలు సాధించడంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం తమకు ఉందని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి