తడబడిన భారత్‌.. 149 పరుగులకే ఆలౌట్‌

టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో... ప్రారంభంలోనే తడబడిన భారత జట్టు 149 పరుగులకే ఆలౌటయ్యింది. ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లలోనూ... సిక్సర్లు, ఫోర్లతో కివీస్ బౌలర్లకు ముచ్చెమటలు పోయించిన టీం ఇండియా బ్యాట్స్‌మెన్‌లు ఈసారి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా 36.3 ఓవర్లలో కేవలం 149 పరుగులు మాత్రమే సాధించారు.

అక్లాండ్‌లో జరుగుతున్న ఐదో వన్డేలో... టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడటంతో గంట ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకే కుదించారు. ప్రారంభం నుంచే కివీస్ బౌలర్ల జోరుకు భారత టాప్ ఆర్డర్ కుప్పగూలింది. అయితే సెహ్వాగ్ మాత్రం మరోసారి కివీస్ బౌలర్లపై విరుచుకుపడి 40 పరుగులు సాధించాడు.

ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన గౌతం గంభీర్‌ (5), సురేష్ రైనా (8), యువరాజ్‌ సింగ్ (11), మహేంద్ర సింగ్ ధోనీ (9), యూసుఫ్‌ పఠాన్‌ (0), హర్భజన్‌ సింగ్ (1), జహీర్‌ఖాన్‌ (5), ప్రవీణ్ ‌(6), ఇషాంత్‌ (3)లు ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్‌ 36.3 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఒంటరిపోరాటం చేసిన రోహిత్‌శర్మ 74 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో... రైడర్‌ మూడు వికెట్లు, ఒబ్రియాన్‌, ఓరమ్‌ రెండు, మీల్స్ ఒక వికెట్‌ తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి