ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. సమాజానికి భయపడి, బయటకు వస్తే ఇరుగుపొరుగువారు సూటిపోటి మాటలు అంటున్నారన్న ఆవేదనతో 14 ఏళ్ల అత్యాచార మైనర్ బాధిత బాలిక ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జూన్ 28న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్షార్ ప్రాంతంలో 14 ఏళ్ల నేహ తన 3 ఏళ్ల తమ్ముడితో ఆడుకుంటూ ఇంటి ముందు కూర్చుని వుంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన విపిన్ అనే యువకుడు మోటార్ బైకు వేసుకుని అక్కడికి వచ్చాడు. ఇతడితో పాటు విశాల్, హేమంత్ అనే మరో ఇద్దరు యువకులు కూడా తమ మోటార్ బైకులతో అక్కడికి వచ్చారు.
విపిన్ కన్ను నేహాపై పడింది. దాంతో నేహా తమ్ముడిని ఆడిస్తున్నట్లు ఆడిస్తూ... బండి మీద ఎక్కుతావా...రా వెళ్దాం అంటూ నేహ తమ్ముడిని బండిపై కూర్చోబెట్టుకున్నాడు. దాంతో నేహ తన తమ్ముడి కోసం వారి వెంట బైకు ఎక్కేసింది. అంతే... ఆ ముగ్గురు ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. దాంతో ఆ బాలిక తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తన పిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ రెండ్రోజుల పాటు ముబావంగా గడిపింది.
ఐతే బాలిక మౌనంగా వుండటంపై ఆరా తీయడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో బాలిక తల్లి ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు విపిన్ ను అరెస్ట్ చేసారు. పరారీలో వున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా బాలికపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగువారు మాట్లాడుకోవడంపై బాధితురాలు నేహ తీవ్రంగా మనోవేదనకు గురైంది. ఈ నెల 15వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. పనికి వెళ్లి వచ్చిన ఆమె తల్లి ఇది గమనించి కన్నీటిపర్యంతమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.