ఫాలోఆన్ ఆడుతున్నప్పటికీ నేపియర్ టెస్టు నుంచి తాము గట్టెక్కుతామని భారత బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఈ తరహా స్థితికి వచ్చినా టెస్టులను కాపాడుకున్న ఘనత భారత్‌కు ఉందని లక్ష్మణ్ గుర్తు చేశాడు.
నేపియర్‌లో శనివారం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆడేందుకు భారత జట్టుకు లభించిన చక్కటి అవకాశమని అన్నాడు. ఈ టెస్టులో ముందు ముందు అద్భుతం సృష్టించేందుకు భారత జట్టుకు అవకాశం ఉందని లక్ష్మణ్ అన్నాడు. గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాం. అలాగే నేపియర్ టెస్టులోనూ అదే దృక్పథంతో ఆడి టెస్టును కాపాడుకుంటామని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
లక్ష్మణ్ విశ్వాసాన్ని నిజం చేస్తూ నాలుగోరోజు ఆటలో భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేయడం విశేషం. మూడోరోజు తన తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన భారత్ వెంటనే ఫాలోఆన్ ప్రారంభించి మూడోరోజు ఆటముగిసే సమయానికి ఓపెనర్ సెహ్వాగ్ వికెట్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
దీంతో నాలుగోరోజు ఆటలో వికెట్లు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో బరిలో దిగిన గంభీర్, ద్రావిడ్ చక్కగా రాణించారు. ద్రావిడ్ అర్ధ సెంచరీ సాధించి అవుటైనా గంభీర్ మాత్రం నాలుగోరోజు సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు మాత్రమే నష్టపోయిన సంగతి తెలిసిందే.