న్యూజిలాండ్‌లో సెంచరీ కోరిక తీరింది: సచిన్

న్యూజిలాండ్‌లో సెంచరీ సాధించాలని చాలాకాలం నుంచి తనకున్న కోరిక ఆదివారం మ్యాచ్‌తో తీరిందని మాస్టర్ బ్యాట్స్‌‍మెన్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఆదివారం ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 392 పరుగుల భారీ స్కోరు చేయడంలో సచిన్ (163) కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో టీం ఇండియాకు సిరీస్‌లో 2-0 ఆధిక్యత లభించింది.

న్యూజిలాండ్ గడ్డపై సచిన్‌కు ఇది తొలి సెంచరీకాగా, కెరీర్‌లో 43వ వన్డే సెంచరీ. మ్యాచ్ విజయం అనంతరం సచిన్ మాట్లాడుతూ.. బంతి గట్టిగా తగలడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చిందన్నాడు. న్యూజిలాండ్‌లో సెంచరీ చాలాకాలం నుంచి తీరనికోరికగా మిగిలింది. అయితే ఎట్టకేలకు ఈ కోరిక తీరడంపట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో రెండుసార్లు ఇక్కడ సెంచరీ చేసే అవకాశాలు చేజారిపోయాయని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి