పిసిబి డైరక్టర్ జనరల్‌గా మియాందాద్ నియామకం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ జనరల్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ మియాందాద్ తిరిగి నియమితులయ్యాడు. తన బాధ్యతలను సోమవారం నుంచి చేపట్టారు. అలాగే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు స్పెషల్ అడ్వైజర్‌గా కూడా మియాందాద్ వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు.

దీనిపై మియాందాద్ మాట్లాడుతూ డైరక్టర్‌ జనరల్‌గా తాను నియమితులయ్యానని, ఈ మేరకు తనకు లేఖ అందిందని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఇదే బాధ్యతలను నిర్వహించిన మియాందాద్, తనకు అప్పగించిన విధులపై అసంతృప్తికి లోనై పదవికి ఈ యేడాది ఫిబ్రవరి ఆరంభంలో రాజీనామా చేసిన విషయం తెల్సిందే. పీసీబీ అధికారులకు, మియాందాద్‌కు మధ్య ఏర్పడిన మాటల యుద్ధం ఫలితంగా ఆయన తప్పుకున్నారు.

అయితే, పాక్ క్రికెట్ అధికారులతో సత్‌ సంబంధాలు నెలకొన్నప్పటికీ తిరిగి బాధ్యతలను చేపట్టేందుకు నిరాకరించాడు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఆయన్ను డైరక్టర్‌ జనరల్‌గా నియమించిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకం పట్ల పీసీబీ ఛైర్మన్ భట్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

124 టెస్టులు ఆడిన మియాందాద్, పాక్ జాతీయ జట్టుకు మూడు సార్లు కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటంచాడు.

వెబ్దునియా పై చదవండి