ఫిరోజ్ షా కోట్లా పిచ్.. టీ-20కి పనికిరాదు: అనిల్ కుంబ్లే

FILE
భారత్-శ్రీలంకల వన్డే సిరీస్ సందర్భంగా నిషేధానికి గురైన ఫిరోజ్ షా కోట్లా క్రీడా మైదానం పరిమిత ఓవర్ల ట్వంటీ-20 మ్యాచ్‌లకు ఏ మాత్రం పనికిరాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మైదానంలోని పిచ్‌పై కేవలం టాస్ మాత్రమే కీలకమని కుంబ్లే వ్యాఖ్యానించాడు.

కాగా గత ఏడాది డిసెంబర్‌లో భారత్- శ్రీలంక మధ్య ఫిరోజ్ షా కోట్లాలో జరిగిన చివరి వన్డే మ్యాచ్ పేలవ పిచ్ కారణంగా 23 ఓవర్ల వద్ద అర్ధాంతంగా రద్దైన సంగతి విదితమే. భారత్-శ్రీలంకల మధ్య జరగాల్సిన అంతర్జాతీయ వన్డే రద్దు కావడంతో ఐసీసీ కమిటీ .. ఏడాదిపాటు ఈ మైదానంపై నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య 35వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ ఫిరోజ్ షా కోట్లాలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కుంబ్లే సన ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కుంబ్లే మాట్లాడుతూ.. ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టతరమని, ఇంకా ఈ మైదానంలో 185 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడం అసాధ్యమన్నాడు. మొత్తానికి ఫిరోజ్ షా కోట్లా మైదానం ఇది నాణ్యమైన పిచ్ కాదని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. ఈ మైదానంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఈ మైదానంలో టాస్ నెగ్గడమే తమకు కలిసొచ్చిందని అంగీకరించాడు.

వెబ్దునియా పై చదవండి