భద్రత లేకపోతే ఆడబోము : దక్షిణాఫ్రికా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో తగినంతగా భద్రతా ప్రమాణాలు లేనిపక్షంలో... టోర్నీలో ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెటర్లెవరూ ఇండియాకు రాబోరని, వారికి రక్షణ కల్పిస్తున్న సంస్థ ఒకటి స్పష్టం చేసింది.

ఐపీఎల్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లు చూసుకునే స్టెయిన్ అండ్ అసోసియేట్స్ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ నికోలస్ మాట్లాడుతూ... తమ ఆటగాళ్లకు సరైన భద్రత లేనట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో టోర్నీలో ఆడేందుకు భారత్‌కు వచ్చే సమస్యేలేదని తేల్చి చెప్పాడు.

భద్రత విషయమై భారత అధికారులతో ప్రతిరోజూ సంప్రదింపులు జరుపుతున్నామనీ.. స్టేడియంలలో భద్రత కల్పించే విషయంలో తమ పాత్ర లేనప్పటికీ.. ఆటగాళ్ల రక్షణా ఏర్పాట్లను తాము పర్యవేక్షిస్తున్నామని రాబర్ట్ వెల్లడించాడు. ఈ మేరకు తమ పరిశీలనలో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని భావించినట్లయితే, తమ దేశ క్రికెటర్లకు భారత్ పంపేందుకు అంగీకరించబోమని ఆయన ఖచ్చితంగా చెప్పాడు.

ఇదిలా ఉంటే... గత వారం పాకిస్థాన్‌లోని లాహోర్లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి అందరికీ గుణపాఠమనీ రాబర్ట్ వ్యాఖ్యానించాడు. కాగా.. భారత్‌లో సాధారణ ఎన్నికలు, ఐపీఎల్ రెండూ ఓకేసారి జరుగుతున్న నేపథ్యంలో, రెండింటికి తగిన భద్రత కల్పించడం సాధ్యంకాని విషయమని నికోలస్ అనుమానం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి