మరోసారి వర్షం: న్యూజిలాండ్ 223/5

హామిల్టన్‌లో టీం ఇండియాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు 43.2 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. అయితే మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ మళ్లీ ఆగిపోయింది. రెండు ఓవర్ల ముందు కూడా వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మెక్‌గ్లాషాన్ 36 పరుగులతో, ఇలియట్ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే అంతకుముందు ఓపెనర్లు రైడర్ (46), మెక్‌‍కలమ్ (77) తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి న్యూజిలాండ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు.

వీరిద్దరూ 20 ఓవర్ వరకు భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పేస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. అయితే యువరాజ్ వేసిన ఇన్నింగ్స్ 20 ఓవర్ తొలి బంతికి రైడర్ (46) రైనాకు క్యాచ్ ఇవ్వడంతో న్యూజిలాండ్ జట్టు తొలి వికెట్ చేజార్చుకుంది. అనంతరం వచ్చిన టేలర్ (5)ను యూసఫ్ పఠాన్ పెవీలియన్ దారిపట్టించాడు.

ఆపై 34వ ఓవర్‌లో జహీర్ ఖాన్‌కు ఓపెనర్ మెక్‌కలమ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో కివీస్ జట్టు మూడో వికెట్ పోగొట్టుకుంది. అనంతరం మరో రెండు వికెట్లు వెంటవెంటనే కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును మెక్‌గ్లాషాన్ (36 నాటౌట్), ఇలియట్ (15) ఆదుకున్నారు.

వీరిద్దరూ ఇప్పటివరకు ఆరో వికెట్ భాగస్వామ్యానికి 48 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీం ఇండియా ఖాతాలో సిరీస్ పడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తప్పనిసరిగా నెగ్గాల్సిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి